ఖనిజ లీజుల్లో పారదర్శకతకు పెద్దపీ
ఈ-వేలం ద్వారానే కేటాయింపులు..
రెవెన్యూ ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ప్రజావాణి
మెదక్, జిల్లా బ్యూరో
సెప్టెంబర్ 7:
అధికారులకు ఆదేశం
ఖనిజాల లీజుల ద్వారా ప్రభుత్వ రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఖనిజ వనరుల వినియోగంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ప్రధాన ఖనిజాలన్నీ ఈ-వేలం ద్వారానే..
సున్నపురాయి, మాంగనీస్, ఇనుప ఖనిజం, లిథియం తదితర ప్రధాన ఖనిజాల లీజులను కేవలం వేలం ద్వారానే కేటాయించే విధంగా భారత ప్రభుత్వం 2015లో ఎంఎండీఆర్ చట్టాన్ని సవరించిందని కలెక్టర్ తెలిపారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జి.ఓ.ఎం.ఎస్. నెం.26, తేదీ 31.03.2022 ద్వారా ముడి రాయి, రోడ్డు మెటల్, భవన నిర్మాణ రాయి, డోలమైట్ తదితర చిన్న ఖనిజాల క్వారీ లీజులను వేలం ఆధారంగా మంజూరు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్, 1966ను సవరించిందని వివరించారు.
ఆదాయ వనరులపై నిరంతర పర్యవేక్షణ..
ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఖనిజ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వేలం విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఒకే డిజిటల్ పోర్టల్ ద్వారా పర్యవేక్షణ..
ఖనిజ బ్లాకుల గుర్తింపు, వేలం ప్రక్రియ, అవసరమైన క్లియరెన్స్‌ల పర్యవేక్షణ వంటి ప్రక్రియలన్నీ ఒకే డిజిటల్ పోర్టల్ ద్వారా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రధాన ఖనిజాల లీజుల కేటాయింపును మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కేవలం ఈ-వేలం ద్వారానే కేటాయింపులు చేపట్టాలని స్పష్టం చేసిందన్నారు.
సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి రెవెన్యూ, మైనింగ్, భూముల కొలతలు, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ఏడి మైన్స్ నాగరాజు, ఏడి ల్యాండ్ సర్వే కిషన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ రంజిత్ కుమార్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.