prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 10:44 pm Digital Edition : MAHESH MEDCHAL

కౌకూర్‌ను వరద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

కౌకూర్‌ను వరద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం


రూ.9.18 కోట్ల డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభం

కౌకూర్: కౌకూర్ ప్రాంతాన్ని వరద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.9.18 కోట్ల విలువైన డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త తుడిమెళ్ల మల్లికార్జున్ తెలిపారు.

కౌకూర్ కింది బస్తీ ప్రాంతంలో ప్రారంభం కానున్న బాక్స్ డ్రైన్ పనులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ కౌకూర్‌లోని డ్రైనేజీ, వరద సమస్యలను గత ఏడాది స్థానిక ప్రజలతో కలిసి మైనంపల్లి హనుమంత్ రావు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

ప్రస్తుతం కింది బస్తీలో బాక్స్ డ్రైన్‌కు రూ.2.50 కోట్లు, ప్రియదర్శిని ఎన్‌క్లేవ్‌లోని నాలా నుంచి వెన్‌రాగ్ వరకు డ్రైనేజీ పనులకు రూ.4.30 కోట్లు, వెన్‌రాగ్ ఎన్‌క్లేవ్ నుంచి ఓం శ్రీ గ్రాండ్ వరకు రూ.2.38 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వివరించారు. మొత్తం రూ.9.18 కోట్ల పనులకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు.

అలాగే విల్లా ఆర్కిడ్స్, జనప్రియ, ప్రశాంత్ విహార్ కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.20 కోట్లకు పైగా విలువైన డ్రైనేజీ పనులు బడ్జెట్ ప్రక్రియలో ఉన్నాయని మల్లికార్జున్ పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న వరద, డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.

అనంతరం మైనంపల్లి హనుమంత్ రావు కౌకూర్ మోడల్ మార్కెట్ భవనాన్ని సందర్శించారు. మోడల్ మార్కెట్‌ను ప్రజా ప్రయోజనాల కోసం కాపాడేందుకు సహకరించినందుకు స్థానిక ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జితేంద్రనాథ్, మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, మహిపాల్ రెడ్డి, చిత్ర గోకుల్, బొడ్డి శ్రీనివాస్ యాదవ్, గోకుల్, అల్లి మల్లేష్, పండు, వేణు గౌడ్, సత్తి రెడ్డి, నరేందర్ రెడ్డి, శివరాజ్, శ్రవణ్, ఆసిఫుల్ల ఖాన్, సయ్యద్ అస్లాం, మహేష్ యాదవ్, కిరణ్, అనురాధ, పుష్ప, వాణి తదితరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.