prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 9:09 pm Digital Edition : PRAJA VANI

కోదాడలో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా

కోదాడలో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా
కోదాడ: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
కోదాడలోని సీసీ రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జాబ్ మేళా కొనసాగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 200 నుంచి 250 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. ప్రతిభ కనబరిచిన వారికి అక్కడికక్కడే స్పాట్ ఆఫర్ లెటర్లు అందించే అవకాశం ఉంది.
ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐతో పాటు BA, B.Sc, B.Com, BBA, BCA వంటి డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నాయకులు కోరారు.
అభ్యర్థులు ఆధార్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, 4 నుంచి 5 సెట్ల రెజ్యూమ్‌లతో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులకు తాగునీరు, ఉచిత భోజనం, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా చిలుకూరు మండల ఎస్టీ సెల్ నాయకులు ధర్మవరం రాజేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమర్నాథ్ నాయక్, భట్టు తదితరులు మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జానకి నాయక గ్రామ సర్పంచ్ అనూష రవికుమార్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి ధర్మావతి సురేష్, లావణ్య, నాగు, ధర్మావతి జాను, ఉపసర్పంచ్ రాఘవేందర్ నాయక్, గున్న మోతిలాల్, వెంకన్న తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.