*అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం ఎలా అందుతోంది?*
*కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై బీజేపీ నేత బచ్చు కృష్ణప్రియ పరిశీలన*
మేడ్చల్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం, భోజనం, ఇతర సదుపాయాలపై మేడ్చల్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి పరిశీలన చేపట్టారు. బీజేపీ 
కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న గుడ్లు, పాలు, పప్పు, పౌష్టికాహారం, భోజనం, రోజుకో రకమైన కూరగాయలు తదితర ఆహార పదార్థాల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఆహారం సక్రమంగా అందుతోందా, పిల్లలకు అవసరమైన పోషకాహారం అందుతున్నదా అనే విషయాలను తల్లులను అడిగి తెలుసుకున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు, తల్లులకు అందుతున్న భోజనం, పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అందుతున్నాయని బచ్చు కృష్ణప్రియ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన వారికి సక్రమంగా చేరేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏవైనా సమస్యలు, సదుపాయాల కొరత లేదా పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తల్లులకు సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో నిర్లక్ష్యం లేకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు, ఆయాలను శాలువాలతో సన్మానించారు. చిన్నారులకు తినుబండారాలు పంపిణీ చేసి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. పిల్లల చదువు, ఆరోగ్యం, అంగన్‌వాడీ కేంద్రాల్లో వారికి అందుతున్న సదుపాయాల గురించి ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, వేముల సత్యనారాయణ రెడ్డి, రామన్నగారి శ్రీనివాస్ గౌడ్, భాగ్యరెడ్డి, జనరల్ సెక్రటరీ జాకట ప్రేమ్ దాస్, నాగరాజు, రాజేష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.