కాశీబుగ్గ లోని
కిడ్నీ ఆసుపత్రిలో వైద్యుల ఆలస్యంపై ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర ఆగ్రహం
పలాస ప్రజావాణి ప్రతినిధి
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కిడ్నీ ఆసుపత్రిని పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10 గంటలైనా కొందరు వైద్యులు విధులకు హాజరు కాకపోవడాన్ని గమనించిన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యుల కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు, ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు, వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తకూడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వైద్యులు నిర్ణీత సమయానికి హాజరై రోగులకు సకాలంలో సేవలు అందించాలని ఆదేశించారు.

సమయానికి విధులకు హాజరు కాని వైద్యులు ఎవరెవరో గుర్తించి, వారి హాజరు వివరాలతో కూడిన నివేదికను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణపై పర్యవేక్షణను పెంచాలని, రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడే ప్రజలకు సకాలంలో వైద్యం అందించడం ప్రతి వైద్య సిబ్బంది బాధ్యత అని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.