prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 10:11 pm Digital Edition : RAJASHEKARREDDY

కాంగ్రెస్ పార్టీకి వడ్లూరి పర్శరాములు రాజీనామా –గుర్తింపు, గౌరవం లభించకపోవడంతోనే నిర్ణయం

బెజ్జంకి, సెప్టెంబర్ 2(ప్రజావాణి)

కాంగ్రెస్ పార్టీలో 2006 నుంచి కార్యకర్తగా పనిచేస్తూ, మండల ప్రధాన కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నాయకుడు వడ్లూరి పర్శరాములు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్‌కు రాజీనామా లేఖ అందించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశానని, ఎంపీటీసీ, సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ పార్టీని వీడకుండా కార్యకర్తగా కొనసాగానని తెలిపారు. పార్టీ కార్యక్రమాల సందర్భంగా అరెస్టులు, కేసులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే కొంతకాలం వేరే పార్టీలో కొనసాగిన విషయాన్ని కారణంగా చూపుతూ తనకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం, అంతర్గత రాజకీయాలు నడపడం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల ప్రజా సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇథనాల్ పరిశ్రమలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ప్రజల తరఫున పాల్గొన్నందుకు కూడా కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తాను కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు.
పార్టీలో దాదాపు 20 ఏళ్లుగా కొనసాగిన తన బంధాన్ని ఈరోజు నుంచి తెంచుకుంటున్నట్లు పర్శరాములు ప్రకటించారు. ప్రస్తుతం తమ జాతి నేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో బెజ్జంకి మండలం ఎన్ఎస్పి అధ్యక్షులుగా కొనసాగుతున్నట్లు వడ్లూరి పరుశరాములు  తెలిపారు.