prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 3:55 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కలసపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, ఎండిపోయిన పంటలకు ఎకరాకు ₹50,000 నష్టపరిహారం ఇవ్వాలి,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కలసపాడు(కడప జిల్లా): సెప్టెంబర్ 22 ప్రజావాణి  సకాలంలో వర్షాలు లేక, భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు రాకపోవడంతో కడప జిల్లా కలసపాడు మండలంలో పంటలు పూర్తిగా ఎండిపోయి రైతాంగం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. మండలంలోని ఈ. తమలపల్లె మరియు రామాపురం గ్రామాల్లో ఎండిపోయిన వరి, కంది పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు సిపిఎం నాయకులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను, ఆవేదనను నాయకుల ఎదుట వెళ్లగక్కారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సగిలి గురయ్యా, మండల ప్రధాన కార్యదర్శి కారు లాజరస్, మరియు మండల అధ్యక్షుడు కారు ఎజ్రా నేతృత్వంలోని బృందం ఆయా గ్రామాల్లోని ఎండిపోయిన పొలాలను సందర్శించి, బాధితులతో మాట్లాడారు. గ్రామాల్లోని రైతులు పొద్దుటూరు పిచ్చయ్య, గంగసాని అబ్బిరెడ్డి, పొద్దుటూరు పీరయ్య తదితరులకు చెందిన దాదాపు 20 ఎకరాలకు పైగా వరి పంట నీరు లేక పూర్తిగా ఎండిపోయి కంటిముందే నాశనమైంది. ఎకరాకు ₹50,000 పైగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయామని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదని, అప్పులు ఎలా తీర్చాలో తెలియక లబోదిబోమంటున్నారు.పొలాల పరిశీలన అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సగిలి గురయ్యా, లాజరస్, ఎజ్రా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మరియు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కరువు మండలంగా ప్రకటించాలి: కలసపాడు మండలంలో తీవ్ర వర్షపాత లేమి, నీటి ఎద్దడి ఉన్నందున తక్షణమే ఈ మండలాన్ని కరువు మండలంగాప్రకటించాలి.నష్టపరిహారం చెల్లించాలి: ఎకరాకు ₹50,000 పైగా పెట్టుబడి పెట్టి నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి, వారికి తక్షణమే ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.త్రాగునీటి సమస్య పరిష్కారం: గ్రామాల్లో పంటలకే కాకుండా ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.రైతుల పొలాల్లోని దారుణ పరిస్థితులను వ్యవసాయ అధికారులు వెంటనే గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపి న్యాయం చేయాలని, లేనిపక్షంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.