కలసపాడు సెప్టెంబర్ 24 ప్రజావాణి మండల నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా బాధ్యతలు స్వీకరించిన హనుమంతును గురువారం మండల తెలుగుదేశం పార్టీ (టిడిపి) ముఖ్య నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై హనుమంతుకు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతలపై అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల టిడిపి యువ నాయకులు సి. ప్రహ్లాద రెడ్డి, సీనియర్ నాయకులు బి. కృష్ణారెడ్డి,టి.నరసయ్య తదితరులు ప్రత్యేకంగా మాట్లాడారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు నూతన ఎస్సై ప్రత్యేక చొరవ చూపాలని వారు కోరారు. చట్టాన్ని గౌరవించే సామాన్య ప్రజలకు,బాధితులకు పోలీస్ స్టేషన్‌లో ఎల్లప్పుడూ న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖకు మరియు వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మండలంలో చట్టవిరుద్ధ పనులను అరికట్టడంలో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.టిడిపి నాయకుల సన్మానానికి మరియు వారి అభినందనలకు ఎస్సై హనుమంతు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కలసపాడు మండల ప్రజల రక్షణ, భద్రతలకు తాము ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా కఠినంగా వ్యవహరిస్తామని,చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేందుకు కృషి చేస్తానని, పోలీస్ శాఖ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేస్తానని ఎస్సై హనుమంతు స్పష్టం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో మండల టిడిపి ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.