*కంప్యూటర్ విద్య, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి*
*బచ్చన్నపేట మండలం, పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్*
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23(ప్రజావాణి):
కంప్యూటర్ విద్య, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
బుధవారం, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించి, విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు.
ముందుగా పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ (ఏఎక్స్ఎల్)ను ప్రారంభించారు. కంప్యూటర్ ల్యాబ్‌లో ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కంప్యూటర్లను సరైన విధంగా వినియోగించేలా కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అనంతరం 5వ తరగతి, ప్రీ-ప్రైమరీ, యూకేజీ, 2వ తరగతి, 3వ తరగతి గదులను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. “What is your name?”, “Father’s name?” అంటూ విద్యార్థులను ప్రశ్నించి, ఆయా సబ్జెక్టుల అంశాలపై విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు.
పాఠశాల ఆవరణలో పరిశుభ్రతను పర్యవేక్షించిన కలెక్టర్, పాఠశాల పరిసరాలను పూర్తిగా శుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
అదే విధంగా ఉన్నత పాఠశాల తరగతి గదుల సంఖ్య, విద్యార్థులు ఎంత మంది అనే వివరాలపై ఆరా తీశారు. పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉన్నారని ఎంఈవో వెంకట్, కలెక్టర్‌కు వివరించారు.
బయట నిర్వహిస్తున్న రెండు తరగతి గదులను పాఠశాల భవనంలోని గదుల్లోకి మార్చాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమృతకు, కలెక్టర్ సూచించారు.
మధ్యాహ్న భోజనశాలను పరిశీలించిన కలెక్టర్, కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న విధానాన్ని గమనించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్‌పై మాత్రమే వంట చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలన్నారు. విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఈ పరిశీలనలో ఎంఈఓ వెంకట్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమృత, ఇతర సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.