prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 8:06 pm Digital Edition : PRAJA VANI

ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం.. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసన ర్యాలీ

*ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం.. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసన ర్యాలీ*

*- ఎన్నికల ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు జరపాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి*

*పరకాల, సెప్టెంబర్ 28 (ప్రజావాణి):*
ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలు, ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అనుమానాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా పారదర్శకతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కని, ప్రతి ఓటు విలువను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.