prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 2:18 pm Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్యే ధర్నా రాజకీయ నాటకం: బీజేపీ

ఎమ్మెల్యే ధర్నా రాజకీయ నాటకం: బీజేపీ

ఓటర్ల తొలగింపుపై గ్రామాల వారీగా ఆధారాలు బయటపెట్టాలి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, సెప్టెంబర్ 29

పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేపట్టిన ధర్నా, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న రాజకీయ నాటకమని బీజేపీ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు.

భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ పెంజర్ల రాకేష్, మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానంద మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విజయరమణారావు ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, ఎస్సారెస్పీ నీటి విడుదల వంటి అంశాలపై ముందుగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఓటర్ల తొలగింపుపై ఆధారాలు వెల్లడించాలి

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని బీజేపీ నాయకులు సూచించారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మందికి పైగా సర్పంచులు ఉన్నారని పేర్కొంటూ, ఆయా గ్రామాల్లో ఓటర్ల జాబితాలో ఎంతమంది పేర్లు తొలగించబడ్డాయో గ్రామాల వారీగా ఆధారాలతో వెల్లడించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.

ఆధారాలు లేకుండా ఓటర్ల తొలగింపుపై సంఖ్యలను ప్రస్తావిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని అన్నారు. 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించిన ప్రక్రియలు, నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, ఓటర్ల జాబితాలో నకిలీ, డబుల్, మరణించిన వ్యక్తుల పేర్లు, వలస వెళ్లిన వారి వివరాలను చట్టబద్ధమైన ప్రక్రియలో పరిశీలించడం ఎన్నికల ప్రక్రియలో భాగమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

కాంగ్రెస్ హామీల అమలుపై ప్రశ్నలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు ఉపాధి, ఉద్యోగాల వంటి హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు.

ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కోసం రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేను కోరారు.

ఓటర్ల తొలగింపుపై నిజమైన వివరాలు, ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని, లేనిపక్షంలో ప్రజలకు వివరణ ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కారెంగుల శ్రీనివాస్, చిలివేరి సంపత్, సీనియర్ నాయకులు తంగెడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్‌రావు, గర్రెపల్లి నారాయణస్వామి, వెల్లంపల్లి శ్రీను, జ్యోతిబాస్, తూడు రవి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, రాజేంద్రప్రసాద్, ఫహీమ్, రమేష్, వెంకటేష్, ఎర్రోళ్ల శ్రీకాంత్, ఉప్పు కిరణ్ మహంతా తదితర రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల నాయకులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.