*ఇది జాబ్ మేళా కాదు..వసూళ్ల మేళ!*
ఎమ్మెల్సీ ఎన్నికల్లో డేటా కోసం నిరుద్యోగులకు టోకరా.. ఈ బూటకపు నాటకానికి నిదర్శనమే ఈ జాబ్ మేళా..
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రచార అర్పాటాలతో దుబార ఖర్చు
సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డ ఉత్తమ్ ఈరోజు నిరుద్యోగులకు సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు గుర్తొచ్చాయా
మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.
కోదాడ,సెప్టెంబర్ 18/ ప్రజావాణి
కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులు, దళితులను మోసం చేస్తూ, తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన విమర్శించారు.నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో మోసం చేసిన వీరు, ఇప్పుడు ‘జాబ్ మేళా’ పేరుతో కొత్త నాటకాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ జాబ్ మేళాలో మొదట 25 వేల ఉద్యోగాలు అన్నారు, ఆ తర్వాత 3500 అన్నారు, తీరా చూస్తే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలను తెచ్చి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. సింగరేణి, మినరల్ ఫండ్స్, సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి బలవంతంగా నిధులు వసూలు చేసి ఈ కార్యక్రమాన్ని తమ సొంత ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్ వంటి ప్రభుత్వ అధికారులను వాడుకుని పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చుకుంటూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత శాఖలోనే అవినీతికి తెరలేపారని అన్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఉన్న లష్కర్ పోస్టులను ఒక్కొక్కటి 3 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తొలగించి, కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల ద్వారా కొత్త వారిని తీసుకుంటున్నారని తెలిపారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో సాగునీరు, కరెంటు లేక పచ్చని పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని, కనీసం రైతుల ఆక్రందనలను కూడా పట్టించుకోవట్లేదని విమర్శించారు. స్థానికంగా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి, ఫ్యాక్టరీల యాజమాన్యాల వద్ద బస్తాకు రెండు రూపాయల చొప్పున కమీషన్లు వసూలు చేయడానికే మంత్రి, ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.ఇటీవల జరిగిన లాకప్ డెత్ ఘటనలో బాధ్యులైన అసలు అధికారులను రక్షించి, ఒక బీసీ వర్గానికి చెందిన ఇన్స్పెక్టర్ ని బలిపశువును చేశారని ఆరోపించారు. లాకప్ డెత్ కు గురైన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో గ్రామాలను దత్తత తీసుకుంటామని చెప్పి, గెలిచిన తర్వాత కనీసం ఒక బడి, గుడి లేదా కనీసం ఒక బోరుబావి కూడా వేయించలేదని గుర్తుచేశారు. పద్మావతి గారు ప్రజల సమస్యలను గాలికొదిలేసి కేవలం ఒక టూరిస్ట్ ఎమ్మెల్యేలా నియోజకవర్గానికి వచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలు గాలికొదిలేసి, సొంత ప్రయోజనాలు, కమీషన్ల కోసం పనిచేస్తున్న ఉత్తమ్ దంపతుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.