prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 12:19 pm Digital Edition : SRIKANTH MULUGU

ఆయుర్వేద వైద్యాన్ని పల్లె ప్రజలకు చేరువ చేయాలి.

 

మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి.

ఏటూరునాగారం ఆయుర్వేద ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు.

జాతీయ ఆయుర్వేద దినోత్సవ శిబిరాన్ని ప్రారంభించిన :: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ఆయుర్వేద వైద్య సేవలను మారుమూల గ్రామాల ప్రజలకు చేరువ చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆయుష్‌ విభాగం అధికారులకు సూచించారు.
11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా బుధవారం ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ, ఆయుర్వేదం పురాతన వైద్య విధానమని, గ్రామీణ ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా శిబిరాలు నిర్వహించాలని అన్నారు. వర్షాకాలంతోపాటు రాబోయే కాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న మారుమూల గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లాలని మంత్రి తెలిపారు. శిబిరాల తేదీలను ముందుగానే స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసి, ఎక్కువ మంది ప్రజలు సేవలు పొందేలా చూడాలన్నారు. ఈ నెల 27న చిన్నబోయినపల్లిలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య బృందం పాల్గొనాలని కోరారు.ఏటూరునాగారంలోని ఆయుర్వేద ఆసుపత్రికి సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రికి పక్కా భవనాలు, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్‌ కేకన్‌, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ బానోత్‌ రవిచందర్‌, వైద్య బృందం, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.