కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 26ప్రజావాణి మండలం అక్కలరెడ్డిపల్లిలో గుండెలు పిండేసే దయనీయ స్థితి నెలకొంది. రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న సుభద్ర-బాలయ్య దంపతుల ఆరుగురు ఆడబిడ్డల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్న ఈ ఆరుగురు పసిమొగ్గలకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘తల్లికి వందనం’ పథకం దక్కకుండా పోయింది. నిబంధనల ప్రకారం అర్హుల జాబితాలో పేర్లు నమోదైనా.వారి బ్యాంకు ఖాతాల్లో మాత్రం ఒక్క పైసా కూడా జమ కాలేదు.రోజూ సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా..మా పరిధిలో లేదంటూ’స్థానిక అధికార యంత్రాంగం నిర్వేదంగా చేతులెత్తేసింది. కూలి పనులు చేసుకుంటే గాని గడవని పేద కుటుంబంపై చదువుల భారం మోయలేనిదిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. “ఆడపిల్లల చదువుకు కొండంత అండగా ఉంటాం” అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తక్షణమే స్పందించి, ఈ ఆరుగురు బిడ్డల చదువులను కాపాడాలని బాధితులు, స్థానికులు వేడుకుంటున్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు
పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుభద్ర, బాలయ్య దంపతులకు ఆరుగురు ఆడపిల్లలు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ దంపతులు రోజూ కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. ఉన్నంతలో తమ పిల్లలను బాగా చదివించి, మంచి ప్రయోజకులను చేయాలని వారు ఆశపడ్డారు. ప్రభుత్వం అందించే సాయం తమ పిల్లల చదువులకు ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని భావించారు.
అర్హత ఉన్నా అన్యాయమే!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఆరుగురు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. పథకానికి సంబంధించిన లబ్ధిదారుల వరిఫికేషన్ ప్రక్రియలో కూడా వీరి కుటుంబం పూర్తి అర్హత సాధించింది. అర్హుల తుది జాబితాలో పేర్లు వచ్చాయి. తీరా ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఒక్క రూపాయి కూడా జ జమ కాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అధికారులను ఆశ్రయించారు.
సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
న్యాయంగా తమకు అందాల్సిన పథకం సొమ్ము ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి ఆ పేద తల్లిదండ్రులు రోజూ సచివాలయం, బ్యాంకుల మెట్లు ఎక్కి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప, సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదు. “సాంకేతిక సమస్యలు ఉన్నాయి, మా పరిధిలో ఏం లేదు” అంటూ స్థానిక అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానాలు చెబుతుండటంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
సీఎం చంద్రబాబు.చొరవ తీసుకోండి
కూలి పనులు దొరకడమే గగనంగా మారిన ఈ రోజుల్లో, ఆరుగురు ఆడపిల్లల పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర చదువుల ఖర్చులు భరించడం ఆ పేద తల్లిదండ్రులకు కొండంత భారంగా మారింది. ఆడబిడ్డల చదువులకు ఏ లోటూ రానివ్వబోమని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరియు జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాంకేతిక కారణాల సాకుతో నిలిచిపోయిన ‘తల్లికి వందనం’ నిధులను వెంటనే విడుదల చేసి, ఆరుగురు ఆడపిల్లల చదువులకు భరోసా కల్పించాలని అక్కలరెడ్డిపల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.