అమరవీరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు కొనసాగించాలి
అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ పిలుపునిచ్చారు.
78వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఐ బెజ్జంకి మండల సమితి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పోతిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భూమి, భుక్తి, శ్రమజీవుల విముక్తి కోసం ఎందరో కమ్యూనిస్టులు, ప్రజలు ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. వారి త్యాగాల ఫలితంగానే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం విజయవంతమైందన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని, వారి త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలను కొనసాగించడమే వారికి నిజమైన నివాళి అని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి సంగేమ్ మధు, దళిత హక్కుల పోరాట కమిటీ జిల్లా సహాయ కార్యదర్శి బోనగిరి శ్రవణ్, ఏఐవైఐఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్,ఏఐవై ఎఫ్ మండల అధ్యక్షులు అంతటి రాకేష్, ఏఐటీయూసీ నాయకులు పండుగ పరశురాములు, సంఘ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.