పోరుమామిళ్ల సెప్టెంబర్ 24 ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి,పెరుగుతున్న అప్పుల విధానంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం 27 నెలల స్వల్ప వ్యవధిలోనే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల సమీపానికి చేరుకుని, రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన విమర్శించారు.ఎన్నికల ముందు ‘సంపద సృష్టిస్తాం’ అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, ఇప్పుడు కేవలం ‘అప్పులు సృష్టించడమే’ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన నాగార్జున రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అప్పుల లెక్కలను వివరంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడిన ప్రధానాంశాలు క్రింది విధంగా ఉన్నాయి:
27 నెలల్లో రూ. 4 లక్షల కోట్ల అప్పులు!
చంద్రబాబు నాయుడు గతంలో 2014-2019 మధ్య కాలంలో చేసిన అప్పుల రికార్డులను తానే స్వయంగా తిరగరాస్తున్నారని నాగార్జున రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో అప్పులు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రతి మంగళవారం ఆర్‌బీఐ ద్వారా అప్పులు తీసుకోవడం ఈ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా మారిందని విమర్శించారు. నిన్న మొన్నటి మంగళవారం కూడా సెక్యూరిటీలను విక్రయించి మరో రూ. 2,600 కోట్ల అప్పు చేశారని గుర్తుచేశారు. బడ్జెట్‌లో ఏడాదికి లక్ష కోట్ల చొప్పున అప్పులు చూపిస్తున్నారని ఆరోపించారు.
అప్పుల విభజన లెక్కలు ఇవే:
ప్రభుత్వం చేస్తున్న అప్పులపై నాగార్జున రెడ్డి క్రింది గణాంకాలను బయటపెట్టారు:
బడ్జెట్ అప్పులు: రూ. 2,24,537 కోట్లు
కార్పొరేషన్ల పేరుతో రుణాలు: రూ. 1,24,000 కోట్లు
రాజధాని పేరుతో చేసిన అప్పులు: రూ. 47,687 కోట్లు ఈ తరహా విచ్చలవిడి అప్పుల వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలు కూడా హెచ్చరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
నాటి అబద్ధపు ప్రచారాలు – నేటి నిజాలు
గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ. 10 లక్షల కోట్లు, రూ. 15 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ చంద్రబాబు మరియు ఆయన అనుకూల ‘ఎల్లో మీడియా’తీవ్ర దుష్ప్రచారం చేశాయని నాగార్జున రెడ్డి గుర్తుచేశారు.ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారిపోతుందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు.కానీ,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వం కేవలం రూ. 3.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని అధికారికంగా ఒప్పుకున్నారని ఆయన స్పష్టం చేశారు. నాటి జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు పంపిణీ చేసి సంపదను పెంచిందని, కానీ నేటి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎటు పోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. అని నాగార్జునరెడ్డి అంటున్నారు,