prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:47 am Digital Edition : PRAJA VANI

అక్రమ నిర్మాణాలతో ‘హై టెన్షన్’!

*అక్రమ నిర్మాణాలతో ‘హై టెన్షన్’!*

*నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు*
*జి+1 అనుమతులతో జి+2, పెంట్ హౌస్ లో నిర్మాణం చేస్తున్నారనే ఆరోపణలు*
*హై టెన్షన్ విద్యుత్ లైన్ల సమీపంలోనూ నిర్మాణాలు.. స్థానికులలో ఆందోళన*
*ప్రజావాణి కూకట్పల్లి ప్రతినిధి, సెప్టెంబర్ 17*

అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా అన్నచందంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు స్థానికులలో ఆందోళనకు కారణం అవుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా సెట్ బ్యాక్ లు లేకుండా, అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆల్విన్ కాలనీ సర్కిల్-51 పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ఫేజ్-3 లోని ప్లాట్ నెంబర్లు 183,184, లో జరుగుతున్న నిర్మాణాలపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత భవనాలకు జి ప్లస్ వన్ అనుమతులు తీసుకుని వాటికి మించి జి ప్లస్ టు తో పాటు పెంట్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణ నిబంధనలు, సెట్ బ్యాక్ లు, విద్యుత్ భద్రత, ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

ముఖ్యంగా భవనాలకు సమీపంలో హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఉండడంతో భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతుంది. అనుమతులకు మించి నిర్మాణాలు జరిగితే భవిష్యత్తులో నివాసితుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాల సమయంలోనే సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించి నిబంధనల ఉల్లంఘనలు ఉంటే అడ్డుకోవాలని కోరుతున్నారు.
*అడ్డగుట్ట లోను అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు*
మరోవైపు సీఎం సి పరిధిలోని అడ్డగుట్ట తదితర ప్రాంతాలలో కూడా అనుమతులకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీ+1 లేదా జీ+2 అనుమతులు తీసుకుని ఆపై అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇకనైనా రహదారులు, పరిమిత స్థలాలలో నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రమాదాల ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అడ్డగుట్ట ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో కార్మికులు మృతి చెందిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు.
అంతేకాకుండా రెసిడెన్షియల్ పర్పస్ లో అనుమతులు తీసుకుని కమర్షియల్ గా కూడా బిల్డింగులను వాడుతున్నారు.
ఒకే ప్లాటిలో ఒక భవనానికి అనుమతి తీసుకుని అదనంగా మరో భవనం నిర్మిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్, మునిసిపల్ జోనల్ కార్యాలయం సమీపంలోనే ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

*అధికారుల తనిఖీలు ఎప్పుడు*

అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు, నిర్మాణ విస్తీర్ణం, సెటబ్యాక్ లు, భద్రత ప్రమాణాలను అధికారులు తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై సంబంధిత శాఖల వివరాలు తెలియాల్సి ఉంది. అక్రమ నిర్మాణాలకు ఎవరి అండదండలు ఉన్నాయని ఆరోపణలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో సంబంధిత మున్సిపల్, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.