prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 10:08 am Digital Edition : PRAJA VANI

7వ వార్డులో దట్టమైన పిచ్చి మొక్కలు పొదల తొలగింపు

7వ వార్డులో దట్టమైన పిచ్చి మొక్కలు,పొదల తొలగింపు

– 7వ వార్డు కౌన్సిలర్  ఖాందేష్ ప్రశాంత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
ఆర్మూర్ టౌన్ ఆగస్టు 04(మన సమగ్ర ప్రజావాణి):

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు తిరుమల కాలనీలో పలు ఖాళీ స్థలాల్లో గత కొంతకాలంగా దట్టంగా పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కలు, పొదల కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఈ పొదల నుంచి పాములు, తేళ్లు తదితర విషకీటకాలు ఇళ్లలోకి ప్రవేశిస్తుండటంతో కాలనీవాసులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యను స్థానికులు 7వ వార్డు కౌన్సిలర్ ఖాందేష్ ప్రశాంత్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసి దట్టమైన పొదలు, పిచ్చి మొక్కల తొలగింపు పనులను ముమ్మరంగా ప్రారంభించారు. కౌన్సిలర్ ఖాందేష్ ప్రశాంత్ స్వయంగా పనుల వద్దకు వెళ్లి పారిశుధ్య కార్యక్రమాన్ని పరిశీలిస్తూ, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఖాందేష్ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు. వార్డులో పారిశుధ్యాన్ని మెరుగుపరచేందుకు మున్సిపాలిటీ నిరంతరం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా వార్డు అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉండి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కౌన్సిలర్ ఖాందేష్ ప్రశాంత్, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి అవసరమైన మరమ్మతు పనులను త్వరలోనే చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యలపై వెంటనే స్పందించి పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన కౌన్సిలర్ ఖాందేష్ ప్రశాంత్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.