పత్రికా ప్రకటన
వ్యవసాయ శాఖ – రామాయంపేట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్
ఎరువుల పంపిణీలో నూతన అధ్యాయం- కేంద్ర ప్రభుత్వం FFS (Framework for Fertilizer Sale) వ్యవస్థ అమలు.
06-08-2026 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS (Framework for Fertilizer Sale) యాప్ ద్వారానే అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు నిర్వహించబడతాయి.
రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో, పారదర్శకంగా అందించడంతో పాటు ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం Framework for Fertilizer Sale (FFS) అనే నూతన డిజిటల్ ప్లాట్ఫారమ్ (యాప్)ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది.
ఈ వ్యవస్థ ద్వారా ఎరువుల కొనుగోలు, పంపిణీ, నిల్వలు, సబ్సిడీ, విక్రయాల పర్యవేక్షణ తదితర ప్రక్రియలన్నీ ఒకే వేదికపై నిర్వహించబడనున్నాయి.
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న యూరియా బుకింగ్ యాప్ ద్వారా ప్రధానంగా యూరియా విక్రయాలు మాత్రమే నమోదు చేయబడేవి. ప్రస్తుతం ప్రవేశపెట్టిన FFS వ్యవస్థలో యూరియా, డీఏపీ (DAP), ఎంఓపీ (MOP), ఎస్పీకే (NPK) కాంప్లెక్స్ ఎరువులు సహా అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా నిర్వహించబడతాయి.
FFS వ్యవస్థ ముఖ్య లక్ష్యాలు
ఎరువుల పంపిణీలో సంపూర్ణ పారదర్శకతను తీసుకురావడం.
– రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడడం.
ఎరువుల నిల్వలు, విక్రయాలు, సబ్సిడీ ప్రక్రియలను రియల్టైమ్లో పర్యవేక్షించడం.
ఎరువుల దుర్వినియోగం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను నియంత్రించడం.
– కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ సరైన లబ్ధిదారులకు చేరేలా చూడడం.
– డిజిటల్ రికార్డుల ద్వారా బాధ్యతాయుతమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయడం.
రైతులు ఎరువులు పొందే విధానం
రైతులు ముందుగా తమ మొబైల్ నంబర్ మరియు అవసరమైన వివరాలతో FFS యాప్ నమోదు చేసుకోవాలి. అనంతరం సాగు పంట, విస్తీర్ణం, అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేసి సమీపంలోని ఎరువుల డీలరు ఎంపిక చేసుకోవాలి.
అనంతరం FFS యాప్ రైతుకు ప్రత్యేక QR కోడ్ను రూపొందిస్తుంది. రైతు ఎంపిక చేసిన డీలర్ వద్దకు వెళ్లి ఆ QR కోడ్ు చూపించాలి. డీలర్ FFS యాప్ లేదా POS పరికరం ద్వారా QR కోడ్ను స్కాన్ చేసిన తర్వాత రైతు వివరాలు, ఎరువుల వివరాలు ధృవీకరించబడతాయి. అనంతరం రైతుకు ఎరువులు అందజేయబడతాయి. విక్రయం పూర్తయిన వెంటనే ఆ సమాచారం కేంద్ర FFS సర్వర్ నమోదు అవుతుంది. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎరువుల పంపిణీని రియల్ టైమ్లో పర్యవేక్షించగలుగుతాయి.
రైతులకు కలిగే ప్రయోజనాలు
– ఎరువుల కోసం అనవసరంగా వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.
-పారదర్శకమైన పంపిణీ వ్యవస్థ ద్వారా సరైన రైతుకు సరైన ఎరువు అందుతుంది.
-ఎరువుల లభ్యతపై స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంటుంది.
-సబ్సిడీ ఎరువుల పంపిణీ మరింత సమర్ధవంతంగా జరుగుతుంది.
ముఖ్య గమనిక
05-08-2026 సాయంత్రం 5.00PM వరకు మాత్రమే ప్రస్తుతం అమలులో ఉన్న పాత ఎరువుల విక్రయ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతాయి.
- 06-08-2026 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS (Framework for Fertilizer Sales) యాప్ ద్వారానే అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు
నిర్వహించబడతాయి
.
కావున రైతులు ఎలాంటి అపోహలు లేదా సందేహాలకు గురికాకుండా, FFS వ్యవస్థకు సహకరించి ఎరువులు కొనుగోలు చేయాలని కోరుతున్నాము. FFS నమోదు, QR కోడ్, ఎరువుల కొనుగోలు విధానం లేదా ఇతర వివరాలపై ఏవైనా సందేహాలు ఉంటే, తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) సంప్రదించగలరు.
మండలం లోని అన్ని ఎరువుల విక్రయ కేంద్రాల్లో FFS విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీ జరిగేలా అవసరమైన చర్యలు చేపడుతున్నాము.
రైతులు ఈ నూతన FFS వ్యవస్థను పూర్తిగా వినియోగించుకొని, ఎరువుల పంపిణీలో పారదర్శకత మరియు సమర్ధతను పెంపొందించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
ప్రస్తుతం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైన మేరకు మాత్రమే ఎరువులను కొనుగోలు చేసి వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు