prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 11:23 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలే మన స్వేచ్ఛకు పునాది…. ఘట్‌కేసర్ ఆర్‌జీకే కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘట్‌కేసర్, ఆగస్టు 15: ఘట్‌కేసర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని పోచారం ఆర్‌జీకే కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సీనియర్ నాయకులు కల్లూరు జయచంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కల్లూరు జయచంద్ర మాట్లాడుతూ.. మన జాతీయ జెండా వెనుక ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని, వారి పోరాటమే మన స్వేచ్ఛకు పునాది అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్ర్యం బ్రిటిష్ పాలకుల చేతుల నుంచి అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్లకూడదని ఆకాంక్షించారని, అయితే స్వాతంత్ర్యం అనంతరం సామాజిక, రాజకీయ సమానత్వం పూర్తిస్థాయిలో సాధించలేకపోయామని అన్నారు. ఇకనైనా బహుజనులంతా ఐక్యంగా ముందుకు సాగి బహుజన రాజ్యాధికారాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మా జ్యోతిరావు పూలే, లాల్ బహదూర్ శాస్త్రి, అల్లూరి సీతారామరాజు, బాబు జగ్జీవన్‌రామ్ తదితర మహనీయుల సేవలు, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు.

“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అంటూ గురజాడ అప్పారావు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు బి. శ్రీనివాస్, అనంతలక్ష్మి, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్. అంజి, ది. యాదవ్, రామచంద్రయ్య, శంకరయ్య, ఎం.ఎస్. చారి, ఎస్. సంజీవ, రామచందర్ రాజు, జమల్, వెంకటేష్, రాము తదితరులు పాల్గొన్నారు.