prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 8:12 am Digital Edition : SRIKANTH MULUGU

సీఎం రాక నేపథ్యంలో అప్రమత్తం

 

ములుగు జిల్లా( ప్రజావాణి )

గోవిందరావుపేట, తాడ్వాయి, మేడారం ప్రాంతాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా మొత్తం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
వరంగల్ సి.పి గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ సూచనలతో పసర సిఐ పత్తిపాక దయాకర్ ఆద్వర్యంలో గోవిందరావుపేట, నార్లాపూర్, మేడారం, తాడ్వాయి మండలాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోవిందరావుపేట, తాడ్వాయి పోలీసులు సంయుక్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. గోవిందరావుపేట, తాడ్వాయి, నార్లాపూర్, మేడారం కలిపే ప్రధాన రహదారులపై వస్తున్న ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇతర జిల్లాల నుండి వస్తున్న లారీలు, ద్విచక్ర వాహనాలు, ప్రైవేట్ కార్లను ఆపి డ్రైవర్ల వివరాలు, వెళ్లాల్సిన గమ్యం గురించి ఆరా తీస్తున్నారు. అనుమానం వచ్చిన వారి గుర్తింపు కార్డులు, వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
రహదారుల వెంట పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటించే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.
ప్రజలకు పోలీసుల సూచన: సీఎం పర్యటన ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. అనవసరంగా రహదారులపై గుమిగూడవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం పర్యటన నేపథ్యంలో గోవిందరావుపేట, తాడ్వాయి ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని స్థానిక ఎస్.ఐ.లు స్పష్టం చేశారు.