prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 7:02 pm Digital Edition : NAZEER CHENNOOR

సింగరేణి ఎస్టీపీపీ జీఎం నరసింహారావు ఘన సన్మానం

జైపూర్ ,ఆగస్టు 31, ప్రజావాణి:

సింగరేణి సంస్థలో 39 ఏళ్లపాటు వివిధ హోదాల్లో అంకితభావంతో సేవలు అందించిన సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) జనరల్ మేనేజర్ ఎం.నరసింహారావు సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్టీపీపీ ఈడీ సిహెచ్.చిరంజీవి మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధిలో నరసింహారావు అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఉద్యోగంలో చేరి, స్వయంకృషి, పట్టుదలతో జీఎం స్థాయికి ఎదిగారని పలువురు అధికారులు గుర్తుచేసుకున్నారు. భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులు, వర్క్‌షాప్‌లు, ఏరియా స్టోర్స్‌లో పనిచేసిన ప్రతీచోటా ఆయన ముద్ర వేశారని తెలిపారు.

2025లో రామగుండం-2 ఏరియా ఇంజనీర్‌గా విశిష్ట సేవలు అందించినందుకు గానూ సంస్థ ఆయనను ‘ఉత్తమ అధికారి’గా గుర్తించిందని గుర్తుచేశారు. ఎస్టీపీపీలో మూడో యూనిట్ నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు, సీఎస్సార్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) నిధులతో ప్లాంటు ప్రభావిత గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు.అనంతరం నరసింహారావును శాలువాలు, జ్ఞాపికలు, పూలమొక్కలతో సత్కరించారు. ఈ వేడుకలో జీఎం (ఈ అండ్ ఎం) సూర్యనారాయణ రాజు, ఏఐటీయూసీ అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ పర్శయ్య, సీఎంఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి.పంతులా, ఏజీఎంలు వి.వి.సుధాకర్ రెడ్డి, బి.శ్రీధర్, చీఫ్ కే.శివప్రసాద్, డీజీఎం రాము, పర్సనల్ విభాగాధిపతి ఎస్.వి.రాజేశ్వర్ రావు, అధికారుల సంఘం ప్రతినిధులు వెంకటయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.