*సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రసక్తే లేదు
”
*299 డివిజన్ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్*
మేడ్చల్ ఆగస్టు 19 (పీపుల్స్ డైరీ):- కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోందంటూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ అన్నారు. పేద కుటుంబాలకు, నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను రద్దు చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు మేరకు గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సాయిపేట శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై వాస్తవాలను ప్రజలకు వివరించకుండా బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై ప్రస్తుతం ఏర్పడిన సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన న్యాయపరమైన అంశాల కారణంగానే కోర్టులో వివాదం ఏర్పడిందన్నారు. చట్టబద్ధత, న్యాయపరమైన అంశాలపై తలెత్తిన సమస్యల నేపథ్యంలో హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించడంతో ప్రస్తుతం నిధుల పంపిణీకి ఆటంకం ఏర్పడిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయడం లేదని, న్యాయస్థానం పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సాయిపేట శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం అందించేందుకు చర్యలు చేపడుతోందని, పథకాలకు సంబంధించిన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుత న్యాయపరమైన సమస్యను పరిష్కరించేందుకు అవసరమైతే హైకోర్టులో అప్పీల్ చేసి పథకాల నిరంతర అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇకనైనా బీఆర్‌ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్, లేబర్ సెల్ అధ్యక్షుడు కావలి భాస్కర్, కాంగ్రెస్ యువ నాయకులు వడ్డే ప్రవీణ్, షబ్బీర్, సోను, మల్లేష్, ఉదయ్, సంపత్, అనిల్, కిషన్, నందు, సురేష్ రెడ్డి, అఖిల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.