prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:19 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

శ్రీధర్‌బాబును కలిసిన మారం లక్ష్మారెడ్డి….ఘట్కేసర్ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేత

ఘట్కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): ఘట్కేసర్ సర్కిల్‌లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఘట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ఐటీ, భారీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును గాంధీభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.

ప్రధానంగా ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నందున వాటిని వేగవంతం చేయాలని కోరారు. వంతెన నిర్మాణం కారణంగా నష్టపోయిన భూ బాధితులకు సత్వరమే నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వంతెన నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇరువైపులా సేవా రహదారులను నిర్మించి, బీటీ రోడ్లు ఏర్పాటు చేసి, జిల్లా బస్సులు బస్టాండ్ మీదుగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఘట్కేసర్‌లోని గురుకుల కళాశాలను జూనియర్ కళాశాల స్థాయి నుంచి డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని, గురుకుల సంస్థకు చెందిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని మంత్రిని కోరారు. ఉప్పల్ నుంచి బీబీనగర్ ఎయిమ్స్ వరకు మెట్రో రైలు విస్తరణ చేపట్టాలని, ఘట్కేసర్ చిన్న చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసి సుందరీకరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించి, సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు మారం లక్ష్మారెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన మంత్రికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.