వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు ఇంకెన్నడు అమలు పరుస్తారు.
కూలీలు అంటే ఇంత నిర్లక్ష్యమా?
వాగ్దానాలు అమలు చేయకుంటే పోరాటాలు తప్పవు.
బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములు.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
శాసనసభ ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను ఇంకెన్నడు అమలు పరుస్తారని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హనుమకొండలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మునిగాల బిక్షపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు,ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి రెండు విడతలుగా 12 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించి 32 నెలలు దాటిన ఇంతవరకు ఒక పైసా కూడా వేయకపోవడం కూలీల ఎడల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమౌతుందన్నారు. పాలకుల విధానం చూస్తుంటే ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న,ఓడ దిగినంక బోడి మల్లన్న అన్న చందంగా ఉందన్నారు.గ్రామీణ ప్రాంతాలలో 100 రోజుల ఉపాధి హామీ పనులలో కనీసం 20 రోజులు పని చేసిన కార్మికులను ఇందిరమ్మ ఆత్మీయ
భరోసా పథకానికి అర్హత కలిగిన వారిగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులు ప్రభుత్వ అధికారుల వద్ద దరఖాస్తులు పెట్టుకొని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యవసాయ కూలీలకు అన్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు.ఆగస్టు 15 నుండి కొత్తగా సామాజిక
చేయూత పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
పథకాన్ని కూడా అమలు జరపాలని డిమాండ్ చేశారు.ఒక్కొక్క వ్యవసాయ కూలీకి 32 నెలలకు సంబంధించి 32 వేల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు.చేయూత పెన్షన్ కొంతమందికి ఇచ్చి చేతులు దులుపు కోవడం కాకుండ 57 సంవత్సరాలు నిండిన అర్హత గలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని,పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకు,వికలాంగులకు 6000కు పెంచి అమలు జరపాలన్నారు.ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న గుడిసె వాసులందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను మంజూరి చేయాలన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపకుంటే వ్యవసాయ కార్మికుల పోరాటాలను ఎదుర్కోవలసి వస్తుందని వెంకట్రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మునిగాల బిక్షపతి,జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్,ఇల్లందుల రాములు,అలువాల రాజు,జేరిపోతుల శిరీష తదితరులు పాల్గొన్నారు.