prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 9:02 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వైభవంగా శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. ముఖ్య అతిథులుగా రానున్న నిర్మాత దిల్ రాజు, హీరో వంశీకృష్ణ!

వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల ఆగస్టు 26 ప్రజావాణి  పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహం ఉప్పొంగుతోంది. పట్టణ పరిధిలోని జె.ఎస్.ఆర్. నగర్ లో నూతనంగా అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో నిర్మించిన శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అత్యంత అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.ఈ మహాత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు, యువ హీరో వంశీకృష్ణ గురువారం విచ్చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు భాగస్వాములు కానున్నారు. ప్రముఖ సినీ ప్రముఖుల రాకతో పోరుమామిళ్ల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఘనంగా సాగుతున్న ధార్మిక కార్యక్రమాలు

ఆలయ స్థలదాత, నిర్మాణ వ్యవస్థాపకులు జడపోలు శ్రీరామ్, ఆలయ కమిటీ అధ్యక్షులు డేరంగుల గురయ్య, గౌరవ సలహాదారుడు జడపోలు రామచంద్రయ్య మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. జడపోలు శ్రీరామ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధతో వైదిక పండితుల మంత్రోచ్ఛారణలు, హోమాలు, జలాధివాసం, ధాన్యాధివాసం వంటి శాస్త్రోక్త పూజా విధులను రమణీయంగా జరిపిస్తున్నారు.ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి పోరుమామిళ్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక జిల్లా నలుమూలల నుండి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి, తీర్థప్రసాదాలు స్వీకరించి, శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ వ్యవస్థాపక బృందం మరియు కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.