*
*సంప్రద హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన*
*25 రోజులు చికిత్స.. రూ.16 లక్షలు ఖర్చు.. చివరకు 23 ఏళ్ల అజయ్ మృతి*
*సదుపాయాలు లేకున్నా చికిత్స చేస్తామన్నారు” — మృతుడి తండ్రి ఆరోపణ*
*మరో రూ.5 లక్షలు చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేశారంటూ బాధితుల ఆవేదన*
మేడ్చల్ ఆగస్టు 12 (పీపుల్స్ డైరీ):- మేడ్చల్‌లోని సంప్రద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందడంతో బుధవారం ఆస్పత్రి ముందు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో లేకపోయినా శస్త్రచికిత్స చేసి కోలుకునేలా చేస్తామని చెప్పి ఆస్పత్రిలో చేర్చుకున్నారని, సుమారు 25 రోజులపాటు చికిత్స అనంతరం యువకుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కాళ్లకల్‌కు చెందిన అజయ్ (23) ఎంబీఏ విద్యార్థి. గత నెల 18న రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయాలు కావడంతో మేడ్చల్‌లోని సంప్రద హాస్పిటల్‌లో చికిత్స కోసం చేర్పించారు. ఇప్పటివరకు సుమారు రూ.16 లక్షలు వైద్య ఖర్చులుగా వెచ్చించినప్పటికీ, బుధవారం చికిత్స పొందుతూ అజయ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
*వేరే ఆస్పత్రికి తీసుకెళ్తామన్నా*
ఆస్పత్రిలో అవసరమైన వైద్య సదుపాయాలు లేవని గుర్తించి అజయ్‌ను మరో ఆస్పత్రికి తరలిస్తామని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ, ఇక్కడే చికిత్స చేసి కోలుకునేలా చేస్తామని ఆస్పత్రి వర్గాలు హామీ ఇచ్చాయని మృతుడి తండ్రి సభాపతి శర్మ ఆరోపించారు. చివరకు కుమారుడు మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
*మరో రూ.5 లక్షల బిల్లు.. ఆందోళన*
అజయ్ మృతి అనంతరం తమకు ఇంకా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉందంటూ ఆస్పత్రి యాజమాన్యం పట్టుబట్టిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మృతుడి బంధువులు ఆస్పత్రి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమ కుమారుడిని కోల్పోయిన బాధలో ఉన్న తమను బిల్లుల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
*గత ఘటనలను గుర్తుచేసిన బాధితులు*
ఈ ఆస్పత్రిలో గతంలోనూ వైద్య ఖర్చుల విషయంలో వివాదాలు చోటుచేసుకున్నాయని బంధువులు ఆరోపించారు. గతంలో చికిత్స పొందిన వ్యక్తి వైద్య బిల్లులు చెల్లించలేదనే కారణంతో ఆయన కుమారుడిని ఆస్పత్రిలో ఉంచి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయని తెలిపారు.
*అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్*
యువకుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి, చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందా? అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఆస్పత్రి నిర్వహణ, వైద్య ప్రమాణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని కోరారు.
