ఘట్‌కేసర్, ఆగస్టు 20 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 7వ డివిజన్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్, టీం రేవంత్ రెడ్డి సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారతదేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ విద్య, సాంకేతికత, సమాచార రంగాల్లో సంస్కరణలకు ఆయన ప్రోత్సాహం అందించారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో యువతకు, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా ఆయన తీసుకున్న చర్యలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేశాయని పేర్కొన్నారు. దేశ ఐక్యత, అభివృద్ధి, ఆధునికీకరణ కోసం రాజీవ్ గాంధీ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవేందర్ ముదిరాజ్, వంగాల లక్ష్మి, పద్మావతి, రేణుక, గౌరీ, శ్రీకాంత్, నరేష్, గణేష్, విజయ్, నాగేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
