మేడ్చల్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

మేడ్చల్: నవభారత నిర్మాత, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మేడ్చల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యం కల్పించి, యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశ అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో దూరదృష్టితో కూడుకున్నవని అన్నారు.
అలాగే గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు అందేలా చర్యలు తీసుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. యువతకు రాజీవ్ గాంధీ ఒక ఐకాన్‌గా నిలిచారని అన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల ముందున్న ప్రధాన కర్తవ్యమని నాయకులు అన్నారు. ఇందుకోసం యువత, పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.