prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:25 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న గరుడాద్రి క్షేత్రం..13 నుంచి 19 వరకు శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు

ఘట్‌కేసర్, ఆగస్టు 10 (ప్రజావాణి):  మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్‌లో ఉత్తర శ్రీ విల్లిపుత్తూరుగా ప్రసిద్ధి చెందిన గరుడాద్రి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను ఆగస్టు 13 నుంచి 19 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.

ఈ సందర్భంగా ఆలయ వంశస్థులు టి.పి. పవనాచార్యులు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, వివిధ వాహన సేవలు, శ్రీ ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం, తిరుక్కళ్యాణ మహోత్సవం, రథోత్సవం తదితర విశిష్ట కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉత్సవాల వివరాలు..ఆగస్టు 13: ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం దేవతాహ్వానం నిర్వహిస్తారు. ఆగస్టు 14: శేషవాహన సేవ, హనుమంత వాహన సేవలతో పాటు శ్రీ ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం నిర్వహించనున్నారు. ఆగస్టు 15: అశ్వవాహన సేవ, గజవాహన సేవలు నిర్వహిస్తారు. ఆగస్టు 16: ఉదయం 11 గంటలకు శ్రీ గోదా సమేత రంగనాయక స్వామివారి తిరుక్కళ్యాణ మహోత్సవం, సాయంత్రం గరుడ సేవ నిర్వహించనున్నారు. ఆగస్టు 17: సాయంత్రం 6 గంటలకు కనులపండుగగా దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఆగస్టు 18: మహాపూర్ణాహుతి, పుష్పయాగం, చక్రతీర్థం, గాంధోళి ఉత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 19: స్వామివారి తిరుమంజనం, ఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

భక్తులు భారీగా తరలిరావాలి…గరుడాద్రి క్షేత్రంలో నిర్వహించనున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ వంశస్థులు కోరారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలు కన్నులపండువగా సాగనున్నాయని వారు తెలిపారు.