prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 6:55 am Digital Edition : RRAJUREGONDA REGONDA

బురదమయమైన రోడ్డుపై నాట్లు వేసి గ్రామ ప్రజల నిరసన

 

గుంతలు, బురదతో అధ్వానంగా మారిన ప్రధాన రహదారి.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

 

కొత్తపల్లి గోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ప్రధాన రహదారి గుంతలు, బురదతో అధ్వానంగా మారడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ రోడ్డుపై నీరు నిలిచి గుంతలు కనిపించకుండా పోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

రోడ్డు దుస్థితిపై ఎన్నిసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వారు తెలిపారు. దీంతో తమ నిరసనను వినూత్నంగా తెలియజేస్తూ బురదమయమైన రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన చేపట్టారు. గుంతల్లో నీరు, బురద పేరుకుపోవడంతో రహదారి వ్యవసాయ పొలాన్ని తలపిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ రహదారి మీదుగా ప్రతిరోజూ విద్యార్థులు, రైతులు, కూలీలు, మహిళలు, వృద్ధులు రాకపోకలు సాగిస్తుంటారని, గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రంగా మారి అత్యవసర సమయాల్లో కూడా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

 

వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజల సమస్యను అధికారులు వెంటనే గుర్తించి రహదారిని పరిశీలించాలని, గుంతలను పూడ్చడంతో పాటు శాశ్వతంగా నాణ్యమైన రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.