prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 2:36 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ప్లాస్టిక్ నివారణకు గోల్డెన్ మటన్ షాపు వినూత్న ప్రయత్నం…టిఫిన్ బాక్స్ తెస్తే మటన్‌పై రూ.50 తగ్గింపు

  1. ఘట్‌కేసర్, ఆగస్టు 24 (ప్రజావాణి): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఘట్‌కేసర్ బాలాజీనగర్–కరీంగూడ రోడ్డులోని గోల్డెన్ మటన్ షాపు యజమానులు లక్ష్మణ్, నగేష్, మధు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మటన్ కొనుగోలుకు వచ్చే వినియోగదారులు తమ వెంట టిఫిన్ బాక్స్ తీసుకువస్తే మటన్‌పై రూ.50 తగ్గింపు అందిస్తున్నారు.

ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు షాపు యజమానులు తెలిపారు. తమ ప్రయత్నానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరి గోల్డెన్ మటన్ షాపు యజమానులను శాలువాలతో సత్కరించి, మినీ భారత రాజ్యాంగ ప్రతులను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో వ్యాపారులు, ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని కోరారు. దుకాణాలకు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా టిఫిన్ బాక్సులు, పునర్వినియోగ సంచులు తీసుకెళ్లే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన గోల్డెన్ మటన్ షాపు యజమానులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో యాదిరెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.