prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 11:44 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

పోచారంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం…పార్టీ బలోపేతమే లక్ష్యం.. నూతన కమిటీలకు దరఖాస్తుల స్వీకరణ..

ఘట్‌కేసర్, ఆగస్టు 17 (ప్రజా వాణి): పోచారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. చౌదరిగూడలోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో గల ఏబీ కన్వెన్షన్ హాల్‌లో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రే రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, రేవంత్ అన్న బృందం సభ్యులు, సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పోచారం డివిజన్‌లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. వార్డు స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పదవులపై ఆసక్తి ఉన్న నాయకులు, క్రియాశీలక కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేసే వారికి కమిటీల్లో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. పదేళ్ల పాటు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ పార్టీ జెండాను మోసిన కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల ప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.