prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 7:57 am Digital Edition : PRAJA VANI

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లక్కీ డ్రా పేరుతో ఘరానా మోసం….?

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లక్కీ డ్రా పేరుతో ఘరానా మోసం….?

పెద్దపల్లి,మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 30

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లక్కీ డ్రా పేరుతో సామాన్య ప్రజలను ఆకర్షిస్తూ భారీగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తక్కువ మొత్తానికే కార్లు బహుమతులు వస్తాయంటూ ప్రచారం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూ.300 చెల్లిస్తే కారు గెలుచుకునే అవకాశం ఉందంటూ 1000 రూపాయలకే 4 టోకెన్లు అని ప్రచారం చేయడంతో పలువురు ఆసక్తితో ఈ డ్రాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

మాటలు ఘనం.. వ్యవహారం అనుమానం…

లక్కీ డ్రా నిర్వహణకు ముందు భారీ బహుమతుల పేరుతో ఇంద్ర ఇన్స్టి యూట్యూబ్, వాట్సప్ లో ప్రచారం చేయడం,అనంతరం నిబంధనలను మార్చడం లేదా చెప్పిన విధంగా నిర్వహించక బహుమతులు ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. చివరకు చూపించేది మరోటి అన్నట్లుగా వ్యవహారం సాగుతోందని బాధితులు వాపోతున్నారు.

సామాన్యులే లక్ష్యంగా….?

రోజువారీ కూలీలు,చిన్న వ్యాపారులు,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిని ఆకర్షించేలా తక్కువ మొత్తంలో టికెట్లు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఒక్కొక్కరి నుంచి వందల రూపాయలు వసూలు చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సమీకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహుమతుల ఆశతో డబ్బులు చెల్లించినవారిలో పలువురికి చివరకు నిరాశే మిగులుతోందని స్థానికులు చెబుతున్నారు.

జిల్లా కేంద్రంలో అధికారుల నిఘా ఏదీ….?

లక్కీ డ్రా పేరుతో డబ్బులు వసూలు చేయడానికి అనుమతులు ఉన్నాయా…? నిబంధనల ప్రకారం డ్రా నిర్వహిస్తున్నారా…? బహుమతుల వివరాలు, విజేతల ఎంపిక,నగదు లావాదేవీలపై సంబంధిత శాఖలు పర్యవేక్షిస్తున్నాయా…? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
లక్కీ డ్రా పేరుతో అమాయకుల నుంచి నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి భారీ బహుమతి పొందాలనే ఆశతో మరింత మంది సామాన్యులు నష్టపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.