బెజ్జంకి, ఆగస్టు 12 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లాలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా బెజ్జంకి మండలంలోని చీలాపూర్ గ్రామంలో ‘సురక్ష నేత్ర’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను సిద్దిపేట అడిషనల్ డీసీపీ కుషాల్కర్ ప్రారంభించారు.చీలాపూర్ గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప–భాస్కరచారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాధాన్యత, డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతా నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు.ప్రజల సహకారంతో ‘సురక్ష నేత్ర’ కార్యక్రమం ద్వారా జిల్లాలో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతుందని అడిషనల్ డీసీపీ తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు నిందితులను గుర్తించడం, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం, రాంగ్‌రూట్ ప్రయాణాలను నివారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, బెజ్జంకి ఎస్సై తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.