డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనుల్లో స్పీడు పెంచాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
హుజూర్నగర్ ఆగస్టు 12 (ప్రజావాణి)

అర్హులకే ఇండ్లు ఇస్తాం. లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తున్నాం.
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు.

హుజుర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, చిన్న చిన్న లోపాలు ఉన్నా వెంటనే రెక్టిఫై చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఇండ్ల సముదాయాల్లో మిగిలిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హుజుర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇండ్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రతి బ్లాక్‌లో ఇన్స్పెక్షన్లు.
ఇటీవల మంత్రి ఆదేశాల మేరకు హౌసింగ్ యూనిట్లలోని ప్రతీ బ్లాక్‌ను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇండ్లలో ఉన్న చిన్న చిన్న లోపాలను గుర్తించి, వాటి జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఆ లోపాలను వెంటనే సరిదిద్దాలని సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇండ్లతో పాటు డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు.
*తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులు వేగవంతం.*
ఇండ్ల సముదాయం ప్రాంగణంలో మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన పునాది పనులు, డైనింగ్ హాల్ నిర్మాణాలు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. వీటితో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయిస్తున్నట్లు వివరించారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు.
*1,805 మందితో తాత్కాలిక జాబితా*
ఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ప్రాథమికంగా 1,805 మంది అర్హులైన లబ్ధిదారులతో జాబితాను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను ప్రత్యేక బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. అర్హత లేని వారి పేర్లు ఉంటే తొలగిస్తామని, నిజమైన పేదలకు మాత్రమే ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు.
కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, పిడి హౌసింగ్ జబ్బర్ హేహ్మద్, తహసిల్దార్ కవిత, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, గుద్దేదారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.