టిఫిన్ తయారు చేస్తుండగా చెలరేగిన మంటలు.. ఉలిక్కిపడ్డ జనం
కీసర: కీసర–ఈసీఐఎల్ ప్రధాన రహదారిపై ఉన్న శరవణ సుప్రభాత్ హోటల్‌లో గురువారం ఉదయం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్‌లో టిఫిన్ తయారు చేస్తున్న సమయంలో సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం.
మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్‌లోని కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. హోటల్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురై ఉలిక్కిపడ్డారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం మరింత విస్తరించకుండా నివారించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సిలిండర్ లీకేజీ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందా.. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.