prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 6:37 pm Digital Edition : NAZEER CHENNOOR

జైపూర్ ఠాణాను తనిఖీ చేసిన మంచిర్యాల డిసిపి

జైపూర్, ఆగస్టు 25, ప్రజావాణి:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఠాణాకు చేరుకున్న డీసీపీకి ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఆయన స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.అనంతరం రిసెప్షన్ సెంటర్, సీసీటీఎన్‌ఎస్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ, క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల పురోగతిపై అధికారులతో మాట్లాడి దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ… సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఠాణా పరిధిలోని గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, సమాచార వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.అనంతరం పోలీసు అధికారులతో కలిసి డీసీపీ ఠాణా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్ తదితరులు పాల్గొన్నారు.