prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 1:53 pm Digital Edition : PRAJA VANI

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తిరుపతి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు.

అనంతరం జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ సేవతో పాటు ప్రజా సేవకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రత, సమాజ శ్రేయస్సు, శాంతిభద్రతల పరిరక్షణలో మరింత అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని కోరారు.

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో బాధ్యత, క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగాలని తెలిపారు.

అనంతరం జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ శ్రీనివాసులు (పరిపాలన), శ్రీ కె. రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), శ్రీ శ్రీనివాసరావు సాయిధర్, ఉప పోలీస్ అధికారులు, పోలీస్ వృత్తి అధికారులు, సహాయ పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.