prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 5:55 pm Digital Edition : RAKESH PEDDAPALLY

జానపద కళలకు జేజేలు… ఘనంగా ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలు

 

 

 

కృషి కళా సంస్థ ఆధ్వర్యంలో జానపద కళోత్సవాలు

 

 200 మంది కళాకారుల ప్రదర్శనలు, పలువురికి జానపద పురస్కారాలు

 

గోదావరిఖని, ఆగస్టు 23 ప్రజావాణి :

 

ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృషి కల్చరల్ అకాడమీ (కృషి కళా సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలోని ఆర్టీసీ డిపో సమీపంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో జానపద కళోత్సవాలు వైభవంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కోల్ ఇండియా పథకాల విజేత, నటుడు కాసిపాక రాజమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో సుమారు 200 మంది కళాకారులు జానపద గీతాలు, నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. పాల్గొన్న కళాకారులందరికీ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. జానపద కళారంగానికి విశిష్ట సేవలందించిన పలువురు కళాకారులను జానపద పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాసిపాక రాజమౌళి మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జానపద కళా వారసత్వాన్ని పరిరక్షిస్తూ సింగరేణి, ప్రభుత్వ, సామాజిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు. కనుమరుగవుతున్న జానపద కళారూపాల పరిరక్షణే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

సంస్థ వ్యవస్థాపకుడు నిట్టూరి రాజారత్నం నెలకొల్పిన కృషి కళా సంస్థను సభ్యులంతా కలిసి మరింత అభివృద్ధి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, కోల్ ఇండియా గోల్డ్ మెడలిస్టు, సింగరేణి ఉద్యోగి కనకం రమణయ్య ఆలపించిన ప్రాచీన జానపద గీతాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గుమ్మడి ఉజ్వల, ఆరెల్లి లక్ష్మీకళ, కనకం శంకర్, చిలుక సమ్మయ్య, పులిపాక బానయ్య, పొనగంటి రాజనర్సు, అమరగాని శ్రీనివాస్, బొమ్మక వంశీ, వడ్డేపల్లి సందీప్, జనగామ రాజనర్సు, మోరె దేవయ్య, శానగొండ రవీందర్, మొలుగూరి సమ్మయ్య, అంబాల రాజయ్య, జాలిగపు రాజు, వడ్లకొండ రవివర్మలకు జానపద పురస్కారాలు అందజేశారు.కాసిపాక రాజమౌళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కృషి కళా సంస్థ కళాకారులు, సమాఖ్య ప్రతినిధులు, సింగరేణి అధికారులు, యూట్యూబ్ నటులు, నాట్య గురువులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుమారు 600 మంది ప్రేక్షకులు ఉత్సవాలను వీక్షించారు.