ఘట్‌కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరిగూడ గ్రామంలో నిర్వహిస్తున్న మిక్సర్ తయారీ యూనిట్‌పై ఎస్ఓటీ ఉప్పల్ జోన్ బృందం బుధవారం దాడి నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం మేరకు యూనిట్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులు, గడువు ముగిసిన ముడి పదార్థాలు, సింథటిక్ ఆహార రంగులను ఉపయోగిస్తూ అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సరైన అనుమతులు, లైసెన్స్ లేకుండా యూనిట్ నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి చౌదరిగూడ గ్రామానికి చెందిన కాలా జోసెఫ్ (50)ను నిందితుడిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆయన నిర్వహిస్తున్న మిక్సర్ తయారీ యూనిట్‌లో సింథటిక్ ఫుడ్ కలర్ బ్లూ స్టార్ గ్రీన్ ఒక సీసా, లెమన్ ఎల్లో 100 గ్రాములు, బ్లూ స్టార్ 50 గ్రాములు, 999 సింథటిక్ ఫుడ్ కలర్‌కు చెందిన ఎరుపు, పసుపు రంగుల 25 సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
తయారీ మిశ్రమం కిలో చొప్పున ఆరు ప్యాకెట్లు, ఆకుపచ్చ రంగు బటానీలు కిలో చొప్పున పది ప్యాకెట్లు, గడువు ముగిసిన స్టార్ జైన్ డ్రై మసాలా ఆరు ప్యాకెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల తయారీలో నిబంధనలకు విరుద్ధంగా పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించడంతో సంబంధిత శాఖల అధికారుల ద్వారా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.