ఘట్కేసర్, ఆగస్టు 15: ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వందన హోటల్, హెచ్‌పీ పెట్రోల్ పంప్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 17 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గుబా సురేష్ (38), ఆయన భార్య గుబా ఉమారాణి (33), కుమార్తె గుబా శ్రావణి (17)లు ద్విచక్ర వాహనం నంబర్ టీజీ-10-ఎఫ్-2209పై హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన టీజీ-07-యూ-2133 నంబర్ గల లారీని డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
లారీ ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న గుబా శ్రావణికి తలకు తీవ్ర రక్తస్రావ గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆమె తల్లి ఉమారాణికి చేతులు, కాళ్లకు గాయాలు కాగా, తండ్రి సురేష్‌కు కూడా చేతులు, కాళ్లకు రక్తస్రావ గాయాలయ్యాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనం తీవ్రంగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న వెంటనే ఘట్‌కేసర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. విచారణలో లారీ డ్రైవర్ తిరుపతి, బి.ఎన్. రెడ్డి నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, గాయపడిన తల్లిదండ్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
వాహనదారులు అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఘట్‌కేసర్ పోలీసులు సూచించారు.