prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 9:11 am Digital Edition : PRAJA VANI

గ్రామాల్లో పోలీసుల విస్తృత పర్యటనలు

గ్రామాల్లో పోలీసుల విస్తృత పర్యటనలు

ప్రజలకు భద్రతపై భరోసా.. నేరాల నివారణే లక్ష్యం

తిరుపతి, ఆగస్టు 20: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు గ్రామాల్లో రాత్రి వేళల్లో బస చేస్తూ స్థానిక పరిస్థితులను పరిశీలించడంతో పాటు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.

పెనగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొండలూరు గ్రామంలో నిర్వహించిన “పల్లె నిద్ర” కార్యక్రమంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పరిస్థితులను పోలీసులు పరిశీలించారు. ప్రజలతో స్థానిక సమస్యలపై చర్చించి సైబర్‌ నేరాలు, రోడ్డు భద్రత, మహిళలు–చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, గంజాయి, గొలుసు దొంగతనాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

చిట్వేల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సున్నితమైన గ్రామం తుమ్మకొండలో “నైట్ హాల్ట్” కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో పోలీసులు మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, అక్రమ కార్యకలాపాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అలాగే పాకాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని వల్లివేడు–చంద్రగిరివారిపల్లి గ్రామాల్లో ఎస్‌ఐ తరుణ్, ఏఎస్ఐ దయాకర్, పోలీసు సిబ్బంది కలిసి “పల్లె నిద్ర” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, ప్రజల భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు.

అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడమే “పల్లె నిద్ర” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా పోలీసులు తెలిపారు.