ఘట్‌కేసర్: గురుకుల్ కళాశాలలో నెలకొన్న అధ్యాపకుల కొరత, కళాశాలను దేవాదాయ శాఖ పరిధి నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశాలపై మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులతో చర్చించారు. రెండు రోజుల క్రితం గురుకుల్ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బుధవారం గురుకుల్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు మల్లారెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా కళాశాలలో ఎదురవుతున్న సమస్యలను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మల్లారెడ్డి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్, సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి గురుకుల్ కళాశాలలో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ త్వరలోనే కళాశాలకు అవసరమైన అధ్యాపకులను పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా గురుకుల్ కళాశాల భవిష్యత్తు, దాని పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలసి పరిస్థితిని వివరించేందుకు సెప్టెంబర్ 7న అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. గురుకుల్ కళాశాలకు సంబంధించిన పలు ముఖ్యమైన పత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి స్పీడ్ పోస్టు ద్వారా పంపించినట్లు వెల్లడించారు.
గురుకుల్ కళాశాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన మల్లారెడ్డికి ఈ సందర్భంగా గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్‌రావు, గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు బచ్చు నగేష్‌కుమార్ గుప్తా, బిజిలి సదానందం, ఎండి సిరాజ్, గురుకుల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.