నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:
చండూరు మున్సిపాలిటీలో నాయకుల రాజకీయ విమర్శలు, సవాళ్లు చివరకు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద తడిబట్టలతో ప్రమాణాలు చేసే స్థాయికి చేరడం కలకలం రేపుతోంది. మున్సిపల్ చైర్మన్ పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, శనివారం ఉదయం ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ప్రమాణం చేస్తానని ప్రకటించడంతో నేడు ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ. అయితే, దేవాలయాల వద్ద ఇలాంటి ప్రమాణాలు చేయడం వల్ల ఊరికి ఎలాంటి కీడు ముంచుకొస్తుందోనని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాభావంతో పంటలు పండక ఇబ్బందుల్లో ఉన్నామని, ఈ చర్యల వల్ల మరింత నష్టం జరుగుతుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సింది పోయి, వ్యక్తిగత దూషణలు, గుడి ప్రమాణాల రాజకీయాలకు దిగడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.