హోరెత్తిన నస్పూర్: కలెక్టర్ కార్యాలయానికి భారీ ఊరేగింపు
* డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పణ
నస్పూర్ , ఆగస్టు 27, ప్రజావాణి:
దీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత సిబ్బంది సమైక్య కార్యాచరణ సమితి (TGEJAC) ఆధ్వర్యంలో నస్పూర్ ఐడిఓసి ప్రాంగణంలో గురువారం చేపట్టిన మహా నిరసన ప్రదర్శన భారీ ఎత్తున చేపట్టారు.మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు నినాదాలతో మారుమోగాయి.నస్పూర్ ప్రధాన ద్వారం నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు భారీ ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెరిపి, తమ న్యాయమైన కోరికలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా పరిపాలనాధికారి (కలెక్టర్) కుమార్ దీపక్ కి సమర్పించారు.
*ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: గడియారం శ్రీహరి*
జేఏసీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ… ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. బకాయి పడ్డ ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
*ప్రధాన కోరికలు ఇవే:*
2వ వేతన సవరణ:రెండవ వేతన సవరణ నివేదికను వెంటనే అమలులోకి తీసుకురావాలి.
కరువు భత్యం బకాయిలు : పెండింగ్‌లో ఉన్న 6 విడతల కరువు భత్యాన్ని వెంటనే మంజూరు చేయాలి.
వైద్య పథకం పునరుద్ధరణ:ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉచిత (నగదు రహిత) పద్ధతిలో సమర్థవంతంగా అమలు చేయాలి.
రూ.2,000 కోట్ల కేటాయింపు : పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం నెలకు రూ.2,000 కోట్లు కేటాయించాలి.
భవిష్య నిధి (సీపీఎస్) పరిష్కారం : సీపీఎస్ విధానానికి బదులుగా ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రతనిచ్చే నిర్ణయం తీసుకోవాలి.
సంఘాల గుర్తింపు : గుర్తింపు పొందిన సంఘాల సమస్యలపై అధికారికంగా చర్చలు జరపాలి.ఈ కార్యక్రమంలో జేఏసీ అదనపు ప్రధాన కార్యదర్శి కె. శంకర్, సహ అధ్యక్షులు జి. చక్రపాణి, శ్రీనివాస్ దేశ్‌పాండే, పొన్న మల్లయ్య, ఇతర నాయకులు బొడ్డు శ్రావణ్ కుమార్, ఎ. సుధాకర్, అనుముల సతీష్ కుమార్, జె. రామ్ కుమార్ మరియు టీజీఓ, టీఎన్జీఓ ప్రతినిధులతో పాటు సుమారు 4,500 మంది సిబ్బంది పాల్గొన్నారు.