prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 5:49 pm Digital Edition : MAHESH MEDCHAL

ఐదేళ్లుగా బిఎల్ఓలకు వాళ్లకు అందని జీతం

విధులు మాత్రం నిరంతరం.. చెల్లింపులు మాత్రం పెండింగ్‌

మేడ్చల్ పరిధిలో 92 మంది బీఎల్ఓలు.. బకాయిలపై అధికారిక స్పష్టత ఏదీ?

మేడ్చల్: ఎన్నికల ప్రక్రియలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) ఐదేళ్లుగా గౌరవ వేతనం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ తహసీల్దార్, ఏరో పరిధితో పాటు మేడ్చల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో సుమారు 92 మంది బీఎల్ఓలు ఎన్నికల సంఘానికి సంబంధించిన విధులను నిరంతరం నిర్వహిస్తున్నప్పటికీ, వారికి రావాల్సిన వార్షిక గౌరవ వేతనం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఓటర్ల జాబితా క్షేత్రస్థాయి పరిశీలన నుంచి కొత్త ఓటర్ల నమోదు, చిరునామాల మార్పులు, మరణించిన ఓటర్ల వివరాల గుర్తింపు వరకు బీఎల్ఓలు అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సమయాల్లో వారి పనిభారం మరింత పెరుగుతుంది. ఇంటింటి సర్వేలు, ఓటర్ల వివరాల ధ్రువీకరణ, డ్రాఫ్ట్ ఓటర్ జాబితా పరిశీలన, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ వంటి పనులను నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఒక్కొక్కరికి వేలల్లో బకాయి

ప్రస్తుతం ఒక్కో బీఎల్ఓలు సంవత్సరానికి సుమారు రూ.18 వేల వరకు గౌరవ వేతనం రావాల్సి ఉన్నట్లు సమాచారం. ఐదేళ్లుగా చెల్లింపులు జరగకపోతే ఒక్కో BLOకు సుమారు రూ.90 వేల వరకు బకాయి ఉండే అవకాశం ఉంది. 92 మంది బీఎల్ఓలు ప్రాథమికంగా లెక్కలోకి తీసుకుంటే ఈ మొత్తం సుమారు రూ.82.80 లక్షలకు చేరుతుంది. అయితే వాస్తవ బకాయి మొత్తం ఎంతన్నది సంబంధిత ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఖర్చులు సొంతం.. వేతనం మాత్రం పెండింగ్‌

క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించడం, ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి విధులకు BLOలు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రయాణం, ఇతర ఖర్చులు కూడా ఎదురవుతున్నప్పటికీ తమకు రావాల్సిన గౌరవ వేతనం ఏళ్ల తరబడి అందకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

నిధులు ఎక్కడ ఆగిపోయాయి?

బీఎల్ఓలు గౌరవ వేతనం చెల్లింపులు ఐదేళ్లుగా ఎందుకు నిలిచిపోయాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఎన్నికల సంఘం నుంచి నిధులు విడుదలయ్యాయా? విడుదలైతే బిల్లుల ప్రక్రియలో సమస్య ఎక్కడ ఏర్పడింది? నిధుల కొరత కారణమా? లేక పరిపాలనా జాప్యమా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

బకాయిలు వెంటనే చెల్లించాలన్న డిమాండ్‌

గత ఐదేళ్లకు సంబంధించిన బకాయిలను సంవత్సరాల వారీగా లెక్కించి, ప్రతి బీఎల్ఓలు చెల్లించాల్సిన మొత్తాన్ని అధికారికంగా నిర్ధారించాలని కోరుతున్నారు. అనంతరం పెండింగ్ బిల్లులను త్వరితగతిన క్లియర్ చేసి బీఎల్ఓలు గౌరవ వేతనం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా అత్యంత కీలకం. ఆ జాబితాను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే బీఎల్ఓలు పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. బాధ్యతలు నిరంతరం అప్పగిస్తూ.. గౌరవ వేతనం మాత్రం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడంపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.