prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:14 am Digital Edition : RAJASHEKARREDDY

ఎరువుల ధరలు తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి -సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్

బెజ్జంకి, ఆగస్టు 11 (ప్రజావాణి)

ఎరువుల ధరలను వెంటనే తగ్గించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎరువుల ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను విపరీతంగా పెంచుతూ రైతులను నిండా ముంచుతోందని విమర్శించారు. ఎరువుల ధరలు పెంచుతున్న ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు.అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ద్వారా 32 దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు అవకాశం కల్పించారని, సున్నా సుంకంతో దిగుమతులకు అవకాశం ఇవ్వడం వల్ల దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోయి పత్తి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
భారతదేశంలో ఏటా సుమారు రూ.18 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నప్పటికీ కనీస మద్దతు ధరలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి మద్దతు ధరలు నిర్ణయించడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని విమర్శించారు.
కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, ఎరువుల ధరలను తగ్గించి రైతాంగానికి న్యాయం చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు బొమ్మిడి సాయికృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.