పాలకుర్తి మండల ఆటో జేఏసీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్
పాలకుర్తి/పెద్దపల్లి ఆగస్టు 9 ప్రజావాణి :
ఈ నెల 24న చేపట్టే రాష్ట్రవ్యాప్త ఆటో బంద్‌ను విజయవంతం చేయాలని పాలకుర్తి మండల ఆటో జేఏసీ పిలుపునిచ్చింది. రామగుండం ఆటో జేఏసీ నియోజకవర్గ ఇన్‌చార్జి మడిపెద్ది రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలైన ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం తదితర వాగ్దానాలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కులను సాధించుకోవడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల ఆటో యూనియన్లు హైదరాబాద్‌లో ఏకమై ఈ బంద్ పిలుపునిచ్చాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7,50,000 మంది ఆటో డ్రైవర్లు ఐక్యంగా తమ గళాన్ని వినిపించి, ఈ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. జబ్బార్, నాయకులు బాణాల భాస్కర్, దుశ్శ బానేష్, బెక్కం శంకర్, బెక్కం రాజేష్, బెక్కం రవి, బి. కమలాకర్, బి. కుమార్, ఎన్. చంద్రయ్య, కొండపలకల దేవయ్య, డి. సంతోష్, ఎన్. ప్రభాకర్, డి. కుమార్, బి. నాని తదితర ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.