prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 9:48 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

రోడ్డు ప్రమాద బాధితుడు బ్రెయిన్‌డెడ్‌ – అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

ఘట్‌కేసర్, జూలై 20: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తిని వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించగా, ఆయన కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధేనువకొండ గ్రామానికి చెందిన గుంజి శ్రీను (40) ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో నివాసముంటూ మేస్త్రీ పనులు చేసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన తాపీ పని నిమిత్తం వెంకిరాల గ్రామానికి వెళ్లిన ఆయన, పని ముగిసిన అనంతరం కూలీలను ఔషాపూర్ బ్రిడ్జి వద్ద దింపి తన ప్యాషన్ ప్రో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు.

రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఔషాపూర్‌లోని దీక్ష హోటల్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డుపై స్కిడ్ కావడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుంజి శ్రీను తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఉండగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈ నెల 20వ తేదీ ఉదయం 11.43 గంటలకు వైద్యులు ఆయనను బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు.

ఈ విషాద సమయంలోనూ సమాజానికి ఉపయోగపడాలనే గొప్ప సంకల్పంతో మృతుడి భార్య గుంజి శ్రావణి, కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. వారి నిర్ణయాన్ని వైద్యులు, పోలీసులు, పలువురు అభినందించారు.

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.